శంషాబాద్‌ఘటనలో ముగ్గురు పోలీసులపై వేటు

శంషాబాద్‌లో యువతి అదృశ్యంపై ఫిర్యాదు స్వీకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. శంషాబాద్‌ గ్రామీణ పీఎస్‌ ఎస్సై రవికుమార్‌, ఎయిర్‌పోర్టు పీఎస్‌కు చెందిన ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌లను సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు. 28వ తేదీ రాత్రి శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తప్పిపోయిన యువతికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో ఆలస్యం కావడంపై విచారణ జరిగింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తున్నట్లు సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని తెలిపారు. ఫిర్యాదు అందితే అధికార పరిధితో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాలని సీసీ ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply