వెలిగొండ పూర్తికి సత్వర చర్యలు 

దోర్నాల,వార్తాప్రపంచం:

* 2020 జూన్ నాటికి మొదటి టన్నెల్ పూర్తి

* నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం

* పోలవరం, వెలిగొండ పూర్తి చేసేందుకు దృఢసంకల్పం తో ఉన్న సీఎం.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసెందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రుల బృందం తెలిపింది. శనివారం దోర్నాల సమీపంలోని కొత్తూరు వద్ద ఉన్న ప్రాజెక్టు టన్నెల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు లో సొరంగం లోపలకు వెళ్లి పనులను పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా అధికారులు మంత్రులకు పలు విషయాలపై వివరణ ఇచ్చారు. ముఖ్యంగా ముంపు గ్రామాల ప్రజల సమస్యలపై  జిల్లా కలెక్టర్ భాస్కర్ మంత్రుల దృష్టికి పలు విషయాలు తెచ్చారు. ఇప్పటికీ నిర్వాసితులకు కాలనీలు ఏర్పాటు చేయకపోవటం వల్ల టన్నెల్ పనులు పూర్తి చేసినా నీరు అందించేందుకు సమస్య అవుతుందని అధికారులకు మంత్రులు సూచించారు.

ఈ సమయం లో మంత్రి సురేష్ అధికారుల నిర్ణయాలపై పలు వాదనలు వినిపించారు. ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చే ఆర్ ఆర్ ప్యాకేజి, ఇళ్ల నిర్మాణం పై స్పష్టత ఇవ్వాలన్నారు. పెద్దారవీడు మండలం ఇడుపూరు లో నిర్వాసితులకు ఇష్టం లేని భూములను టీడీపీ నాయకుల కోసం కొని కోట్ల రూపాయలు కాజేశారని, వాటిపై గ్రామస్తులు కోర్టు ను ఆశ్రయించిన విషయాన్ని మంత్రి సురేష్ ప్రస్తావించారు. ముంపు గ్రామాల కోసం కాలనీ ల ఏర్పాటు త్వరగా చేపట్టి, ప్యాకేజీ అందించి, 18 ఏళ్ళు నిండిన వ్యక్తులు, కొత్తగా ఏర్పడిన కుటుంబాల లెక్క తేల్చాలని సూచించారు.

అనంతరం మంత్రి అనిల్ కుమార్ విలేకరుల తో మాట్లాడారు. ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ దృఢ సంకల్పం తో ఉన్నారన్నారు. పోలవరం, వెలిగొండ కు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జూన్ 2020 నాటికి మొదటి టన్నెల్ పూర్తి చేస్తామని నీరు అందించేందుకు ప్రధాన అడ్డంకి గా ఉన్న ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు త్వరితగతిన పునరావాస కాలనీలు నిర్మిస్తామన్నారు. మొదటి టన్నెల్ పనుల కాంట్రాక్ట్ లో రివర్స్ టెండరింగ్ ద్వారా 60 కోట్లు ఆదా అయ్యిందన్నారు. మార్కాపురం, కనిగిరి ఎమ్మెల్యే లు నాగార్జునరెడ్డి, మధుసూదన్ యాదవ్, కలెక్టర్ పోలా భాస్కర్, జె సీ షన్మోహన్, వెలిగొండ ప్రాజెక్ట్ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply