నేను కంచెను.. ఖాకీ కంచెను ఒక గోడను.. 

హైదరాబాద్,వార్తాప్రపంచం:

నేను కంచెను.. ఖాకీ కంచెను ఒక గోడను.. సమాజాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడే రాతి గోడను. అవును వట్టి బండరాళ్ల గోడను మాత్రమే. ఎందుకంటే.. సమాజంలో, సమాజం కోసం ఉన్న అనేక వ్యవస్థల్లో నేనూ ఒక వ్యవస్థను మాత్రమే. కానీ నా కర్మ ఏమిటో.. సమాజానికి ఏ కష్టం వచ్చినా.. ఆ వ్యవస్థకు సమాజం నుంచి ప్రతిఘటన వచ్చినా.. నేనే ఆ ఇద్దరి మధ్య నలిగిపోవాలి.. తిట్లు, దెబ్బలు తినాలి. ఆ ఇద్దరి మధ్య పోరులో వారు నష్టపోకుండా ఆ నష్టాన్ని నేను భరించి వారిని సంతోషంగా ఉంచాలి.

కొన్నాళ్ల తర్వాత వాళ్లు కలిసిపోతారు.. అన్నీ మరచిపోతారు.. కలిసి పండుగ చేసుకుంటారు కూడా. నన్నుమాత్రం పిలవరు. ఎందుకంటే.. నేను ఒక గోడను.. రాతి బండను. మనిషిని కాను.

పెద్దవాళ్లకు, పిల్లలకు, స్త్రీలకు, యువతకు, పేదవారికి, ధనవంతులకు అందరికీ ప్రతీసారీ అవసరం వచ్చినప్పుడల్లా నేను గోడలా, కంచెలా ఉండాలి. వాళ్లు ఇష్టం వచ్చినట్లుగా నేను తల వంచాలి. పెరగాలి.. తగ్గాలి. లేకుంటే నన్ను కూలగొడతారు. ఎందుకంటే నేను రాళ్లతో కట్టిన ఒక గోడను మాత్రమే. 24 గంటలూ.. 365 రోజులూ ఎండనకా.. వాననకా.. చలనకా రక్షణ ఇస్తూనే ఉంటాను.

కరెంటు పోయినా.. వర్షం పడినా.. రోడ్డు పాడైనా.. గుంత పడినా.. మురుగునీరు వచ్చినా.. మంటలొచ్చినా.. అంబులెన్సు రాకున్నా.. పిల్లాడు బడికిపోకున్నా.. భర్త కొట్టినా.. భార్య కాపురానికి రాకున్నా.. ట్రాఫిక్ జామ్ అయినా.. టెంపుల్, బరాత్, మ్యారేజ్.. ఇలా ఎన్నో పనులు. అన్నింటికీ మీకు కంచెగా, అండగా ఉండాలి. కాని నేను ఈ వ్యస్థలో భాగం కాదా? నేను వేరా?

ఈ సమాజంలో, వ్యవస్థలో నేను ఒకడిని కానా? నేను దత్త పుత్రుడినా? అనాథనా?  చాలా బాధగా ఉంది.. గుండె కోసి వేరుచేసినట్లుగా ఉంది.

ఎన్నో లక్షల సమస్యలు.. సమాజంలో ఎన్నో వ్యవస్థలు, సంస్థలు తాము చేసే తప్పులకు ప్రతీసారీ మేము ముందుండాలి. అందరి తరఫున పోరాడాలి.. సర్ది చెప్పాలి. కానీ ఒక్కరికి కూడా గత రెండురోజులుగా జరిగిన సంఘటనల్లో తెలంగాణ పోలీస్ అనే గోడ (కంచె) చేసిన ఏ ఒక్క మంచి పని కూడా గుర్తురావడంలేదు.

ఈ ఐదేళ్లలో చేసిన ఎన్నో మంచి పనుల్లో ఒక్కటీ గుర్తుకు రాదు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ సిటీ బెస్ట్ సేఫ్ సిటీ అవార్డు.. ముఖ్యంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈ నగరంలో బాగా ఉంటుందని ఇస్తున్నారు. అది కూడా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నదని గుర్తురాదు.

ఇదే న్యూస్ పేపర్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లు ఏటా ఆ న్యూస్ ఐటమ్ వేస్తూనే ఉన్నా.. ఈ రెండు రోజులు న్యూస్ కవర్ చేసుకుని పండగ చేసుకుంటారు అయినా వారికీ ఇది గుర్తురాదు.

అవును.. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ అనుభవం నుంచి నేర్చుకుంటారు. ఈ సమాజంలో మీక ఎవరి మీద కోపం వచ్చినా నా మీద (పోలీసు కంచె) ఒక రాయి వేయవచ్చు. నేను ఓర్చుకుంటాను.. తట్టుకుంటాను.. భరిస్తాను. ఎందుకంటే నేను మీకేమీ కాను. నేను ఒక అనాథను. మీకు, మీ మిగతా వ్యవస్థలకు నేను బానిసను. నన్ను మీరేమైనా అనొచ్చు.. ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నేను మీ బానిసను.

అవును నేను ఒప్పుకుంటాను. నా రక్షణ కవచంలోని ఒక ఆడకూతురికి ఇలా జరగడం నన్నూ ఎంతో మనోవేదకు గురిచేస్తోంది. ఈ దారుణాన్ని ఆపలేకపోయానే అనే బాధలో నేను మదనపడుతుంటే నాలో భాగమైన ఒకటో రెండో ఇటుకలు ఈ దుర్ఘటన జరిగిన తర్వాత స్పందించిన విధానం, ప్రతిస్పందించని వైనం ద్వారా ఆ రాళ్లు మిమ్మల్ని బాధపెట్టాయని నాను నేను కుమిలిపోయాను.

కానీ ఈ కంచెకు ఓ కర్తవ్యం ఉంది. నా మీద మీరు ఎంత దాడి చేసినా మీతో కలిసిపోయిన మీ శత్రువులను పట్టుకుని, మిమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత నాదే. ఎవరేమన్నా.. మీ రక్షణ బాధ్యత నాది. అందులో ప్రాణాలు పోయినా నాకు సంతోషం. (నేను రాయిని కదా.. మరి నాకు ప్రాణముంటుందా? ఏమో??) బాహుబలి సినిమాలో కట్టప్ప చెప్పినట్లు నేను సమాజానికి కట్టుబానిసను. ప్రజలకు కోపం వచ్చినా, సంతోషం వచ్చినా భరించాల్సిందే. అందుకు నేనేమీ అనుకోను. కానీ మొదటిసారిగా ఈ రాతికి ఏడుపు వస్తోంది.. ఏడవాలి అని ఉంది. కాని ఎవరి దగ్గర??

మీరు, మీ వ్యవస్థలు అంతా కలిసిపోతున్నారు. పంచుకుంటున్నారు. చివరకు ఓ ఇద్దరి మధ్య చిచ్చుపెట్టి నారదుడి పాత్ర పోషించే మీడియా కూడా మీతోనే.  నేనొక్కడినే అనాథను.. ఒంటరిని.

ఇంట్లో కొడుకు కొట్టని, భర్త కొట్టినా, పక్కింటోడు తిట్టినా మీకు భయం వేసినా.. ఎవరైనా భయపెట్టినా.. మీరు ఎవరినైనా భయపెట్టాలన్నా.. అలిగినా.. బాధ కలిగినా.. ఈ గోడ దగ్గరకు వచ్చి మీ బాధ చెప్పుకుంటారు. నేను వింటాను. నేను వినకపోతే కొట్టే హక్కు, తిట్టే హక్కు మీకుంది. కాని మొదటిసారి మీరందరూ నన్ను ఒంటరిగా వదిలేశారు. అది చాలా బాధగా ఉంది.

ఇంకో విషయం.. నా కూతురు.. నా రక్షణలో ఉండాల్సిన ఓ ఆడకూతురికి జరిగిన అన్యాయాన్ని అరికట్టలేకపోయాను.. అనే భయంకరమైన నిజం నన్ను దహించివేస్తోంది. ఇప్పుడు మనమందరం కలిసి మరెవరికీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలి. అంటే ఏం చేయాలో ఆలోచించాలి. జరిగిన తప్పులు పునరావృతం కాకుండా సిస్టంలోని గ్యాప్స్ పూర్తిచేయాలి. కానీ ఎవరికివారుగా చీలిపోయి ఈ సంఘటనను ఎవరి స్వలాభానికి వారు వాడుకుంటే ఎలా? అసలు సమస్య ఏమిటో గుర్తించి దానిని సమష్టిగా.. ఒక సమాజంగా కలిసికట్టుగా ఎదుర్కోవలసిన సమయంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలిసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ పోలీసు కంచెకు బాధగా ఉంది.

ఇక్కడే పుట్టారు. ఇక్కడే ఉంటారు. నిన్నటివరకు ప్రశాంత నగరంగా మన నగరానికి పేరుంది. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటిన్ నగరం. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విద్య, ఉద్యోగరీత్యా వస్తున్న లక్షల మంది ఇక్కడే ఉండపోవాలనుకోడానికి ఈ నగరంలో ఉండే ప్రశాంతత, శాంతిభద్రతలే ప్రధాన కారణం.

చాలాసార్లు ఈ విషయం గురించి మీకు చెప్పడం జరిగింది. ఏదో ఒక్క అవాఛనీయ సంఘటన కారణంగా మన నగరాన్ని మనమే అన్‌సేఫ్ సిటీగా క్రియేట్ చేసుకుంటే లాభం ఎవరికి?

ఒక న్యూయార్క్ సిటీ, ముంబయి, లండన్.. ఏ నగరాన్ని తీసుకున్నా అక్కడి ప్రజలు వారికి సమస్య వచ్చినప్పుడు సమష్టిగా స్పందించారు. ఆ నగరాన్ని కాపాడుకున్నారు. మరి ఇక్కడి తెలుగు మీడియా అంతా ఏకమై మన నగర ప్రతిష్ఠను మంటగలిపేస్తోంది. ఎవరికి మేలు చేయడానికి? ఒకసారి ఆలోచించండి. అవును అందరికి ఒక నమ్మకాన్ని కలిగిద్దాం. మరెప్పుడూ ఇలాంటి దుర్ఘటన జరగకుండా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇద్దాం. సమాజంలో ఉన్న, సిస్టంలో ఉన్నలొసుగులను సరిదిద్ధే నిర్మాణాత్మక సలహాలను, ఆచరణాత్మక విధానాలను ఏర్పాటు చేసుకుందాం.

కానీ, మూడురోజులుగా అందరు మేధావులు, ముఖ్యంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేధావులు ప్రవర్తించిన విధానాన్ని ఒకసారి చూసినప్పుడు.. చట్టాల మీద అపారమైన  జ్ఞానం ఉన్న మేధావులారా.. ఇలాంటి అమానవీయ సంఘటనలలో బాధితుల ఫొటోలు చూపించకూడదని, పేర్లు వెల్లడించకూడదని మీకు తెలీదా? ఈ విషయం మీకు తెలీదని అనుకోవాలా? ఒక్క  నేషనల్ మీడియా కూడా ఈ విషయం ప్రసారం చేయలేదు.. ప్రచురణ చేయలేదు. మీకు ఉన్నంత నాలెడ్జ్ వారికి లేదనుకోవాలా? ఇంకా ఘోరమైన విషయం ఎక్స్‌క్లుజివ్ పేరుతో రిమాండ్ రిపోర్ట్ విషయాలను మీరు ప్రస్తావించడం వలన సమాజానికి మీరు ఏం చెప్పదలచుకున్నారు? సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు?

రాక్షసత్వానికి పరాకాష్టగా మీరు ఏం కోరుకుంటున్నారు?

ఒక ఆడకూతురు ఆవేదన ఇన్‌కెమెరాలోనే వినడం ఇబ్బందిగా ఉంటే.. వీటిని బయటపెట్టడం వల్ల ఆ కుటుంబానికి ఎంత భయానకమైన అనుభవం అవుతుందో మీ బ్యాడ్ ఇంటెన్షన్‌కు అర్థంకాదా?

ఇది మీ టీవీలో రావడంతో, పేపర్లో పబ్లిష్ కావడంతో ఒక్కరోజులో ఆగిపోతుందా? ప్రతీ చిన్న విషయం సోషల్ మీడియా.. వాట్సాప్, యూట్యూబ్ వంటి వాటి ద్వారా ప్రతీ మొబైల్‌కు చేరితే.. ఓ గాడ్ ఎంత ప్రమాదం జరుగుతుందో మీకు తెలియదని అనుకోను. అయినా మీరు అదే చేస్తున్నారు. అంటే మీ ఇంటెన్షన్ ఏమిటి?

  • గొర్రె కసాయివాడినే నమ్ముతుంది. ఎందుకంటే.. పబ్లిక్ ఎమోషనల్ అండ్ పర్సనల్ అన్నీ మీరే కాబట్టి.
  • నేను ఇప్పటికీ గోడను, రాయినే. కానీ నా చెల్లెళ్లు, అక్కలు, అమ్మలు.. వీరందిరిలో నేనే ధైర్యం నింపాలి.
  • ఇలాంటి దుర్ఘటనలు, దారుణాలు మళ్లీ మళ్లీ జరగకూడదంటే మన వ్యవస్థను మరింత పటిష్ఠపరుచుకోవాలి.

Leave a Reply