*@- మహిళా ఆకాశంలో సగం, మరి అవకాశల్లో... ?*
*@- ఆర్ధిక స్వేచ్ఛ లేనిదే సాధికారిత సాదించలేము..*
*హైదరాబాద్, అమరావతి:*
అంతర్జాతీయ మాహిళా దినోత్సవం ఈ సందర్భంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ మద్దినేని మానస మహిళామణులకు శుభాకాంక్షలు తెలియజేశారు..
నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ మద్దినేని మానస మాట్లాడుతూ కిర్గిస్థాన్ నుంచి కాంబోడియా వరకు ప్రపంచ దేశాలు మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కతిక రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను దేశ దేశాలు స్మరించుకుంటున్నాయి. ఇంకా ఏయే రంగాల్లో మహిళలు విజయాలను సాధించాలో కార్యచరణకు రూపకల్పన చేసుకుంటున్నాయి.. అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో 1908లో, ఫిబ్రవరి నెలలో 15 వేల మంది మహిళా వస్త్ర వ్యాపారులు చేసిన ఆందోళన ప్రపంచ మహిళా శక్తికి స్ఫూర్తినివ్వగా, 1917, ఫిబ్రవరి 23వ తేదీన రష్యాలో జరిగిన మహిళల ఆందోళన అంతర్జాతీయ మహిళా శక్తిగా అది రూపాంతరం చెందేందుకు దోహదపడింది. మగవారితో సమానంగా వేతనాలు ఇవ్వాలని, పని గంటలను తగ్గించాలని న్యూయార్క్‌లో మహిళా వస్త్ర వ్యాపారులు సమ్మె చేశారు. ఆ సమ్మెకు గుర్తుగా 1909, ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తొలిసారి జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. 1910లో ప్రముఖ సోషలిస్ట్ క్లారా జెట్‌కిన్స్ పిలుపు మేరకు ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్’ పేరిట సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 17 దేశాల నుంచి దాదాపు 100 మంది మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. రష్యాలో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా మహిళల ప్రదర్శన నిర్వహించింది. 1917లో రష్యాలో అక్టోబర్ విప్లవం ప్రారంభానికి అనువైన పరిస్థితులు నెలకొంటున్న రోజుల్లో జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23, రష్యా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8వ తేదీన ‘ఆహారం–శాంతి’ పేరిట రష్యా మహిళలు భారీ ప్రదర్శన జరిపారు. ఈ ప్రదర్శన నుంచే మహిళలకు కూడా ఓటు హక్కు కావాలనే డిమాండ్ ముందుకు రావడంతో అప్పటి రష్యా చక్రవర్తులు దాన్ని అమలు చేశారు.బ్రిటన్ కంటే ఓ ఏడాది ముందు, అమెరికా కంటే మూడేళ్ల ముందు రష్యా మహిళలు ఓటు హక్కును సాధించడంతో అక్కడి మహిళా ఉద్యమాన్ని విప్లవాత్మకమైనదిగా చరిత్రకారులు భావించారు. 1975లో తొలి అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని పాటించిన ఐక్యరాజ్య సమితి ఆ సందర్భంగా మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి మెజారిటీ దేశాలు మార్చి 8వ తేదీనే మహిళా దినోత్సవంగా పాటిస్తున్నాయని ఆమె తెలియజేశారు.
మార్చి నెలను "మహిళ సాధికార మాసం" గా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ మద్దినేని మానస డిమాండ్ చేశారు.
మహిళలు సాధికారత కోసం, కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడానికి పని చేస్తున్నారు. ఇప్పటికే మహిళలు వివక్ష పూరితమైన వ్యవస్థ వల్ల ఎంతో నష్టపోయారు. అలాంటిది వాళ్ళు పని చేసే ప్రదేశాల్లో వేధింపులకు గురైతే ఎలా.? సర్దుకుపోవాలా, నిలదీయాలా.?.
*అందుకే ఈ చట్టం..*
పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం,సంస్కరణ) చట్టం-2013.. ఈ చట్టం మన దేశంలో మహిళలకు కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నుంచి రక్షణ కలిగించడానికి ఏర్పడ్డ చట్టం. ఇది 2012 సెప్టెంబర్ 3న లోక్ సభలో 2013 ఫిబ్రవరి 26న రాజ్యసభలో ఆమోదం పొందింది. 2013 డిసెంబర్ 9న అమలులోనికి వచ్చింది. ఈ చట్టాన్ని 40% భారత కంపెనీలు, 25% బహుళ జాతీ సంస్థలు పాటించడం లేదు.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 14, 15 ప్రకారం లైంగిక వేధింపు అనేది స్త్రీ ప్రాధమిక సమాన హక్కులను ఉల్లంఘిస్తోంది. అంతేకాక ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, హుందాగా జీవించే హక్కు, ఏ వృత్తి, ఉద్యోగం, వాణిజ్యం లేదా వ్యాపారం అయినా చేపట్టే హక్కులోనే లైంగిక వేధింపులు లేని వాతావరణంలో పని చేసే హక్కు కూడా ఉంది. చట్టం అమలు కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చెయ్యాలి..
*అసలు లైంగిక వేధింపులు అనగా ఏవి...*
లైంగిక పరమైన వ్యాఖ్యలు చేయడం లేదా సూచనలు/ సంకేతాలు ఇవ్వడం.. ఒక వ్యక్తి శరీరం లేదా రూపాన్ని వర్ణిస్తూ టీజింగ్ చేయడం లేదా అసభ్యకరంగా ప్రవర్తించడం. అసభ్యకరమైన వ్యాఖ్యలు లేదా జోకులు వేయడం.. లైంగిక జీవితానికి సంబంధించిన అనుచితమైన ప్రశ్నలు, సూచనలు లేదా వ్యాఖ్యలు చేయడం. లైంగిక లేదా అశ్లీల చిత్రాలు, పోస్టర్లు, ఎస్.ఎం.ఎస్, వాట్సాప్ లేదా ఈ మెయిల్ ను పంపించడం. లైంగిక ప్రయోజనాల కోసం బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చెయ్యడం. అనుచిత ప్రవర్తనకి వ్యతిరేకంగా మాట్లాడే ఉద్యోగినిపై లైంగిక బెదిరింపులు లేదా ప్రతీకార చర్యలు చేపట్టడం.. సాధారణంగా సరసం పేరుతో లైంగిక పదాలను వాడటం మరియ సామాజిక ఆహ్వానాలను పంపించడం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లైంగిక బెదిరింపులు, వాగ్ధానాలతో కూడిన అనుచిత ప్రవర్తన. శరీరాన్ని తాకడం, గిల్లడం/ గిచ్చడం లాంటివి చేయడం. ఇష్టం లేకపోయినా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయడం (దాడిగా పరిగణించబడుతుంది). ఎటువంటి కారణం లేకుండా శరీరానికి చాలా దగ్గరగా రావడం, ఉదేశ్యపూర్వకంగా శరీరాన్ని తాకడం మరియు టార్గెట్ చేయడం. లైంగిక వాంఛను తిరస్కరించిన వ్యక్తిని ఉద్యోగం నుండి తొలగిస్తానని బెదిరించడం లేదా ఆమె పని తీరును ఉదేశ్యం పూర్వకంగా తక్కువ చేసి మాట్లాడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడటం.
*ఈ చట్టం పూర్తి కార్య రూపం దాల్చడానికి తీసుకోవాల్సిన చర్యలు:*
ఈ చట్టం ప్రకారం పది మంది లేదా అంత కంటే ఎక్కువ మహిళలు పనిచేసే చోట అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో కనీసం నలుగురు సభ్యులు ఉండాలి. కార్యాలయంలో పనిచేసే సీనియర్ మహిళ ఉద్యోగి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉంటారు.. అలాగే ఇద్దరు సంస్థ సభ్యులు ఉంటారు. వారిలో ఒకరు మహిళ హక్కుల పట్ల అవగహన కలిగి ఉండాలి. కనీసం ఒక సభ్యులు బయటి వారు ఉంటారు. స్వచ్చంధ సంస్థ ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తారు. కనీసం యాబై శాతం మహిళలు ఈ కమిటీలో ఉండాలి. అంతర్గత ఫిర్యాదుల కమిటీ యొక్క పని ఏమిటంటే ఫిర్యాదులు తీసుకోవడం మరియు తగిన చర్యలు తీసుకోవడం.
ఈ కమిటీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయవచ్చు అంటే..
ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వరంగ సంస్థ, ప్రైవేట్ సంస్థ,
ప్రభుత్వ, ప్రైవేట్ కర్మాగారం, విద్యా సంస్థ, ప్రభుత్వ, ప్రైవేట్ అనుబంధ సంస్థ, సొసైటీ, ట్రస్ట్, స్వచ్చంధ సంస్థ, సేవలను అందించే సంస్థ (సర్వీస్ ప్రొవైడర్స్), ఆసుపత్రి,
వినోదాన్ని అందించే సంస్థ (ఎంటర్టైన్మెంట్,టీవీ,సినిమా),
ఆరోగ్య, ఆర్థికపరమైన సేవలు అందించే ప్రదేశం.. సెక్షన్ 3 ప్రకారం ఏ ఒక్క మహిళ కూడా తాను పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురి కాకుండా ఉండాలి..
*మౌనం వీడండి, భయపడకండి.. ఫిర్యాదు చేయండి. మీకు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ అండగా ఉంటుంది...*