అమరావతి/ వార్తా ప్రపంచం:
ఒక సాధారణ రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తే, ఒక గొప్ప నాయకుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు. చంద్రబాబు నాయుడు సరిగ్గా అదే చేస్తున్నారు. చంద్రబాబునాయుడు భవిష్యత్ గురించి.. రాష్ట్రం గురించి..దేశం గురించి ఆలోచించే నాయకుడు. తాను ఉన్నా లేకపోయినా దేశం,రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారు . అందుకే ఆయన జనాభా గురించి ప్రస్తావిస్తున్నారు. కేవలం ఓట్ల రాజకీయం కోసం కాకుండా, రాబోయే 50 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రకటించిన “పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ” ఒక సాహసోపేతమైన ముందడుగు. గతంలో జనాభా నియంత్రణకు మొగ్గు చూపిన ఆయనే, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా జననాల రేటు పెంచాలని పిలుపునివ్వడం ఆయనకున్న దీర్ఘకాలిక దార్శనికతకు నిదర్శనం.
*డెమోగ్రాఫిక్ డివిడెండ్ తగ్గిపోతే నష్టమే*
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, చైనా నేడు యువ జనాభా తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. అక్కడ పని చేసేవారు లేక ఉత్పాదకత పడిపోతోంది. ఇదే పరిస్థితి మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల సగటు సంతానోత్పత్తి రేటు కేవలం 1.5 – 1.6 ఉంది. ఇది ఇలాగే కొనసాగితే వృద్ధ రాష్ట్రాలు అయిపోతాయి. యువత లేని రాష్ట్రం ఆర్థికంగా ఎదగలేదని, అందుకే జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు మళ్లాలని ఆయన తీసుకున్న నిర్ణయం అత్యంత వివేకవంతమైనది.
*విమర్శకుల వాదనలో డొల్లతనం*
చంద్రబాబు ప్రకటనను ఎద్దేవా చేసే రాజకీయ ప్రత్యర్థులు ప్రాథమిక వాస్తవాలను విస్మరిస్తున్నారు. జనాభా పెరిగితే వనరులు సరిపోవని వాదించే వారు, ఆ జనాభాను హ్యూమన్ క్యాపిటల్ గా మార్చే చంద్రబాబు నైపుణ్యాభివృద్ధి వ్యూహాన్ని గమనించడం లేదు. కేవలం జనాభా పెంచడమే కాదు, పెరిగిన జనాభాకు ఉపాధి కల్పించేలా ఐటీ, ఇండస్ట్రీ రంగాలను ఆయన ఇప్పటికే సిద్ధం చేశారు. విమర్శకులకు కేవలం ప్రస్తుత రాజకీయ విద్వేషం తప్ప, రాబోయే తరాల సంక్షేమంపై కనీస అవగాహన లేదని ఈ చర్చల ద్వారా స్పష్టమవుతోంది.
*పాలసీలో కీలక ఆకర్షణలు*
కొత్త విధానంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం కొన్ని విప్లవాత్మక రాయితీలను ప్రకటించింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు కాన్పు సమయంలో 25,000 ఆర్థిక సాయం. మూడో సంతానానికి 18 ఏళ్లు వచ్చే వరకు ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది. భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లలున్న వారికి రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చేలా సంస్కరణలు. తండ్రులు కూడా బాధ్యత పంచుకునేలా రెండో బిడ్డకు ఒక నెల, మూడో బిడ్డకు రెండు నెలల పెటర్నిటీ లీవ్స్ ఇస్తారు.